రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక హెచ్చరిక జారీ చేసింది. రిజర్వేషన్ కోచ్‌లలోకి సరైన టికెట్ లేకుండా ప్రవేశించే ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. రిజర్వుడ్ కోచ్‌లో ప్రయాణించేందుకు చెల్లుబాటు అయ్యే రిజర్వేషన్ టికెట్ తప్పనిసరిగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
సరైన టికెట్ లేకుండా రిజర్వేషన్ కోచ్‌లోకి ప్రవేశించినా లేదా ప్రయాణించినా రూ.2,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అంతేకాకుండా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం, వారి సీట్లను ఆక్రమించడం లేదా ప్రయాణాన్ని అడ్డుకోవడం వంటి చర్యలకు రూ.1,000 వరకు జరిమానా విధించనున్నట్లు పేర్కొంది.విధించిన జరిమానాను చెల్లించకుండా నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టు ద్వారా రూ.3,000 వరకు అదనపు జరిమానా పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా జనరల్ టికెట్ ఉన్న ప్రయాణికులు రిజర్వేషన్ కోచ్‌లలోకి ప్రవేశించవద్దని సూచించారు.
ప్రయాణికులు తమ టికెట్లో పేర్కొన్న కోచ్, సీటు వివరాలను పరిశీలించుకుని ప్రయాణించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రిజర్వేషన్ ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.
