ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగాలని కోరుతూ ఆయన కుమార్తె వైఎస్ సునీత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. కేసు దర్యాప్తు, న్యాయ ప్రక్రియపై తన ఆవేదనను లేఖ ద్వారా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ఏడేళ్లు పూర్తయినా ఇప్పటికీ తన కుటుంబానికి న్యాయం అందలేదని సునీత లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసులో న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని ఆమె విజ్ఞప్తి చేశారు.
వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలాకాలంగా చర్చనీయాంశంగా కొనసాగుతోంది. ఈ కేసులో దర్యాప్తు, విచారణకు సంబంధించిన పరిణామాలు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాజాగా సునీత రాష్ట్రపతికి లేఖ రాయడంతో ఈ అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది.
తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం చాలా కాలంగా పోరాడుతున్న సునీత, కేసు త్వరితగతిన న్యాయపరంగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతికి పంపిన లేఖపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
