ఎమ్మిగనూరు రూరల్, జూన్ 15: రైతులు వేరుశెనగ పంటలో అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా లాభపడేలా చేయాలనే లక్ష్యంతో ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. NMEO-OS-VCC పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాఘవేంద్ర నేతృత్వం వహించగా, ఆదోని మండల వ్యవసాయ అధికారి సుధాకర్, వ్యవసాయ అధికారి రామాంజనేయులు, సాయిల్ కన్జర్వేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులకు వేరుశెనగ సాగులో అనుసరించాల్సిన ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక దిగుబడినిచ్చే విత్తన రకాల ఎంపిక, భూసార నమూనాల సేకరణ, నేల పరీక్షల ప్రాముఖ్యతపై సమగ్రంగా వివరించారు. సాగుకు ముందు భూమిని సక్రమంగా సిద్ధం చేయడం, లోతైన దుక్కి చేయడం, భూమిని సమతలీకరించడం, సేంద్రియ ఎరువుల వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక సూచనలు అందించారు.
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాఘవేంద్ర మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సరైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా దిగుబడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అలాగే నేల పరీక్షల ఆధారంగా ఎరువులను వినియోగించడం వల్ల ఖర్చులు తగ్గి, పంట ఆరోగ్యంగా పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న రైతులు పంట సాగుకు సంబంధించిన పలు సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ అవగాహన కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పాల్గొన్న రైతులు అభిప్రాయపడ్డారు.