కర్నూలులో ఆర్టీఈ చట్టం అమలులో ఉన్న లోపాలను సవరించాలని కోరుతూ Rayalaseema Vidyarthi Porata Samithi రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ ఆధ్వర్యంలో ప్రతినిధులు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం–2009 ప్రకారం 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపులో నిజమైన పేద విద్యార్థులకు మాత్రమే లబ్ధి చేకూరేలా కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. తప్పుడు ధృవపత్రాలతో ప్రయోజనం పొందుతున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్ పెంచాలని కోరారు. అదనపు ఫీజుల వసూలు నిరోధం, జిల్లా స్థాయి ఫిర్యాదు కమిటీ ఏర్పాటు, పూర్తిస్థాయి ఆన్‌లైన్ పారదర్శక విధానం అమలు చేయాలని సూచించారు. గ్రామ/వార్డు స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు.