దేశవ్యాప్తంగా చిన్న నోట్ల కొరత సమస్యకు పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేయనుంది. త్వరలోనే హైబ్రిడ్ ATMలను ప్రవేశపెట్టేలా చర్యలు చేపడుతోంది. ఈ కొత్త తరహా ATMల ద్వారా ప్రజలు రూ.10, రూ.20, రూ.50 వంటి చిన్న కరెన్సీ నోట్లను సులభంగా పొందే అవకాశం ఉంటుంది.
హైబ్రిడ్ ATMల ప్రత్యేకత ఏమిటంటే, పెద్ద నోట్లు డిపాజిట్ చేస్తే వాటికి బదులుగా చిన్న నోట్లు మాత్రమే కాకుండా నాణేలు కూడా అందించే విధంగా వీటిని రూపొందిస్తున్నారు. దీని వల్ల రోజువారీ లావాదేవీల్లో ఎదురయ్యే చిల్లర సమస్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజా రవాణా, చిన్న దుకాణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడనుంది.
చిన్న కరెన్సీపై డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, మరింత ముద్రణ చేపట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం కోరనుంది. హైబ్రిడ్ ATMల అమలుతో నగదు లావాదేవీలు మరింత సౌకర్యవంతంగా మారుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు ఉపశమనంగా నిలవనుంది.
