కర్నూలు జిల్లాలో మహిళలకు అండగా నిలిచిన పోలీసుల మానవత్వం ప్రజల ప్రశంసలను అందుకుంటోంది. మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న ఇద్దరు మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. బెంగళూరు వెళ్లేందుకు ముందుగా ప్రైవేటు ట్రావెల్స్‌లో టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, బస్సు సమయానికి ముందే బయలుదేరి వెళ్లడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న మహిళలు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న సీఐ రామాంజులు, ఎస్సై మల్లికార్జున స్పందించి ట్రావెల్స్ నిర్వాహకులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి ఆదేశాల మేరకు ట్రావెల్స్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేసి, మహిళలు చెల్లించిన టికెట్ మొత్తాన్ని తిరిగి వారి ఖాతాలో జమ చేయించారు.
అంతేకాకుండా, పోలీసులు స్వయంగా మరో ట్రావెల్స్‌లో మహిళలకు టికెట్లు బుక్ చేసి సురక్షితంగా పంపించారు. ఆపదలో అండగా నిలిచిన పోలీసుల మానవత్వాన్ని మహిళా భక్తులు ప్రశంసించారు. ఈ ఘటన పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచింది.
