మంత్రాలయం పుణ్యక్షేత్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం దేవదర్శనానికి వచ్చి తిరుగు ప్రయాణంలో ఉండగా ఘోర రోడ్డు ప్రమాదం వారి కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం అభయ ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు కార్తీక్ దుర్మరణం చెందాడు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కర్ణాటకలోని మైసూర్ జిల్లా హుబ్లీ తాలూకా కారువారి గ్రామానికి చెందిన వీరేశ్, చైత్ర దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రాలయం వచ్చారు. వారు ముందుగా శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకుని అనంతరం అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత రహదారికి అవతల ఉన్న శ్రీరాముని విగ్రహాన్ని చూసేందుకు కుటుంబ సభ్యులు జాతీయ రహదారి–167ను దాటుతుండగా ప్రమాదం జరిగింది.
అదే సమయంలో వేగంగా వచ్చిన కర్ణాటక ఆర్టీసీ బస్సు చిన్నారి కార్తీక్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బాలుడు బస్సు చక్రాల కింద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనను చూసిన భక్తులు, స్థానికులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రాలయం సీఐ దస్తగిరి బాబు, ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. ఈ విషాద సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
